ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఫైజాన్ అహ్మద్, ఐఏఎస్ బుధవారం మూడుచింతలపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవల నాణ్యతను ఆయన స్వయంగా పర్యవేక్షించారు.
ఆసుపత్రిలోని అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించిన అదనపు కలెక్టర్, రికార్డుల నిర్వహణ, మందుల స్టాక్, రోగుల చికిత్స వివరాలను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మందుల నిల్వలు ఉన్నాయా లేదా అన్న విషయంపై ఆరా తీశారు.
రికార్డుల నిర్వహణలో ఎలాంటి అలసత్వం సహించబోమని హెచ్చరించిన ఆయన, ప్రభుత్వ మందులు పేదలకు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలింతలతో ఆయన ప్రత్యక్షంగా మాట్లాడి, భోజన సదుపాయం, వైద్యుల అందుబాటు, చికిత్స విధానాలపై వివరాలు తెలుసుకున్నారు.
ప్రభుత్వం అందిస్తున్న పథకాలు వారికి అందుతున్నాయా అనే అంశాన్ని కూడా పరిశీలించారు. శిశువుల ఆరోగ్యం, టీకాల ప్రాముఖ్యతపై వారికి అవగాహన కల్పించారు. వైద్యం అనేది కేవలం వృత్తి మాత్రమే కాదని, అది ఒక బాధ్యత అని వైద్య సిబ్బందిని ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు.
గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా వ్యాధులను తగ్గించవచ్చని, శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. ఈ తనిఖీలో స్థానిక వైద్యులు, రెవెన్యూ అధికారులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.











