హత్నూరా, జూలై 25
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం గుండ్లమాచునూర్ గ్రామ శివారులో ఉన్న కోవాలేంట్ పరిశ్రమ నుంచి వెలువడుతున్న విష వాయువులపై గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం పరిశ్రమ నుంచి ఒక్కసారిగా విడుదలైన విష వాయువులతో ప్రజలు ఊపిరాడక ఇబ్బందులు పడ్డారు.
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం గుండ్లమాచునూర్ గ్రామ శివారులోని కోవాలేంట్ పరిశ్రమ విచ్చలవిడిగా విడుదల చేస్తున్న విష వాయువులపై గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం కోవాలేంట్ పరిశ్రమ నుంచి ఒక్కసారిగా విష వాయువులు విడుదల కావడంతో గ్రామంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఒక దశలో ఊపిరాడలేని పరిస్థితి నెలకొంది.
పరిశ్రమ విడుదల చేసిన వాయువులను వెంటనే గమనించిన పాలకవర్గ సభ్యులు పరిశ్రమ వద్దకు చేరుకొని, పరిశ్రమ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా వాయు, జల కాలుష్యాన్ని విడుదల చేయడంతో గ్రామంలో ఉండలేని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. అంతేకాకుండా ఈ విషపూరిత వాయువుల వల్ల గ్రామస్తులు అవస్థలు పడుతున్నట్లు తెలిపారు.
పలుమార్లు కోవాలేంట్ పరిశ్రమ తీరుపై యాజమాన్యానికి సూచించినా పట్టించుకోకపోవడమేమిటని పరిశ్రమ ప్రతినిధులను ప్రశ్నించారు. ప్రధానంగా బాయిలర్ నుంచి వచ్చే దట్టమైన దుమ్ముతో కూడిన పొగ వల్ల గ్రామంలోని ఇళ్ల దాబాలపై దుమ్ము ధూళి పెద్ద ఎత్తున పేరుకుపోతుందని దుయ్యబట్టారు.
ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే పరిశ్రమ ముట్టడి కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. అనంతరం అక్కడి నుంచి తరలి వెళ్లి సంగారెడ్డిలోని పీసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీహరి, ఉప సర్పంచ్ శంకర్, వార్డు సభ్యులు భద్రేశ్, అంకిత ప్రభాకర్, లక్ష్మీ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.











