జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశాల మేరకు, మే 3న నిర్వహించనున్న నీట్ (యూజీ)–2026 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. 8 కేంద్రాలలో 2,772 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.
సంగారెడ్డి జిల్లాలో నీట్ (యూజీ)–2026 పరీక్షను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని సన్నాహాలు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రకటించారు. జిల్లాలోని 8 పరీక్షా కేంద్రాలలో మొత్తం 2,772 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నట్లు ఆయన వెల్లడించారు.
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్టిఏ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డు, ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డు (ఆధార్, పాన్, పాస్‌పోర్ట్, స్టూడెంట్ ఐడీ), రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, ఒక పోస్ట్‌కార్డ్ సైజ్ ఫోటో, పారదర్శకమైన నీటి బాటిల్ మాత్రమే తీసుకురావాలని కలెక్టర్ సూచించారు.
అభ్యర్థులు గేట్ క్లోజింగ్ సమయానికి ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. తేలికపాటి దుస్తులు, స్లిప్పర్లు లేదా తక్కువ ఎత్తు ఉన్న చెప్పులు ధరించాలి. పరీక్షా కేంద్రంలో ఎన్టిఏ అందించే బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను మాత్రమే ఉపయోగించాలి. ఓఎంఆర్ షీట్, హాజరు పట్టికపై ఇన్విజిలేటర్ సమక్షంలో సంతకాలు చేయాలి.
షూస్, బూట్లు, హైహీల్స్, భారీ డిజైన్లు కలిగిన దుస్తులు, మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, బ్లూటూత్ పరికరాలు, కాలిక్యులేటర్లు, బ్యాగులు, పర్సులు, బెల్టులు, నగలు, స్వంత పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు తీసుకురావడం నిషేధం. ఓఎంఆర్ షీట్‌పై అనవసర గుర్తులు చేయరాదని అధికారులు హెచ్చరించారు. అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రం చిరునామాను ముందురోజే ధృవీకరించుకుని, సమయానికి చేరుకోవాలని, తల్లిదండ్రులు, అభ్యర్థులు సహకరించాలని కలెక్టర్ కోరారు.












