పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ధర్మవరం నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను రాష్ట్ర మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వర్చువల్ కాల్ ద్వారా అభినందించారు. విద్యార్థుల భవిష్యత్ లక్ష్యాలను తెలుసుకుని, వారికి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
రాష్ట్ర మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్, ధర్మవరం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులతో విజయవాడ నుంచి వర్చువల్ కాల్ ద్వారా సంభాషించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూనే ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మంచి మార్కులు సాధించిన విద్యార్థుల ప్రతిభను ఆయన ప్రశంసించారు.
విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులతోనూ మంత్రి నేరుగా మాట్లాడి, వారి భవిష్యత్ ప్రణాళికలు, లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు చదువు పట్ల చూపిస్తున్న శ్రద్ధను, వారికి అండగా నిలుస్తున్న తల్లిదండ్రుల కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ఉన్నత చదువుల కోసం విద్యార్థులకు ఎలాంటి సహాయం కావాలన్నా తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని మంత్రి భరోసా ఇచ్చారు. ముఖ్యంగా, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు తన సంస్కృతి సేవా సమితి ద్వారా ఉచిత శిక్షణతో పాటు బోర్డింగ్ సదుపాయాలు కల్పిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనుకునే విద్యార్థులందరికీ తాను "తమ ఇంటి బిడ్డలా" ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని మంత్రి ఆత్మీయంగా హామీ ఇచ్చారు. లక్ష్య సాధనలో ఎదురయ్యే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోవడంలో అండగా నిలబడతానని ఆయన భరోసా కల్పించారు. విద్యార్థులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.










