జిల్లాలో జరగనున్న నీట్ (యూజీ)-2026 ప్రవేశ పరీక్షను ఎలాంటి లోపాలు లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌తో కలిసి నిర్వహించిన జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ ఈ ఆదేశాలు జారీ చేశారు. మే 3వ తేదీన మధ్యాహ్నం 2:00 నుంచి 5:00 గంటల వరకు జరగనున్న ఈ పరీక్షకు జిల్లావ్యాప్తంగా 1078 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇందుకోసం సింగరేణి ఉమెన్స్ కళాశాల, శ్రీ రామచంద్ర డిగ్రీ కళాశాల, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ పాఠశాల (నవభారత్ ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ఎదురుగా) చొప్పున మూడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు మాత్రమే కేంద్రాల్లోకి అనుమతిస్తారని, బయోమెట్రిక్ హాజరు, రిజిస్ట్రేషన్, భద్రతా తనిఖీల దృష్ట్యా ముందుగానే చేరుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డుపై తప్పనిసరిగా ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అతికించుకోవాలని, అదనంగా మరో ఫోటోతో పాటు తాజా గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, నగలు వంటి వస్తువులను అనుమతించబోమని తెలిపారు.
పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163(బి) అమలు చేయాలని, పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాల పర్యవేక్షణ, ప్రశ్నాపత్రాల రవాణా, జవాబు పత్రాల భద్రతకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే, ప్రతి కేంద్రంలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కోరారు.
విద్యుత్ శాఖ అధికారులు పరీక్షా సమయంలో నిరంతరాయ విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని, తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్య నిర్వహణ సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఈ పరీక్ష విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పరీక్షను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ అభ్యర్థించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, డిఎస్పి ఆదినారాయణ, సీఐ సతీష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.











