టీనేజ్ ప్రెగ్నెన్సీ, ప్రేమ పేరుతో జరిగే మోసాలపై అవగాహన కల్పించేందుకు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ విద్యార్థులకు కీలక సూచనలు చేశారు.
ప్రజా ప్రభుత్వం నిర్వహిస్తున్న 99 రోజుల ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా ఈ అవగాహన సదస్సు మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మాట్లాడుతూ, కౌమార దశలో పిల్లలు ప్రేమ వంటి విషయాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తును పాడుచేసుకోవద్దని సూచించారు. క్రమశిక్షణతో విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించాలని ఆయన కోరారు.
బాల్య వివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలను ఆయన వివరించారు. చిన్న వయసులో వివాహాలు ఆరోగ్యంతో పాటు సామాజికంగా తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు. సోషల్ మీడియా వినియోగం పెరిగిపోవడంతో, దాని ద్వారా జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వీలైనంత వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు.
లైంగిక వేధింపుల వల్ల పిల్లలపై కలిగే మానసిక, శారీరక సమస్యలను అదనపు కలెక్టర్ ప్రస్తావించారు. ‘సేఫ్ టచ్ – అన్‌సేఫ్ టచ్’ పై పిల్లలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు.
ఈ సదస్సులో జిల్లా సంక్షేమ అధికారి శారద, ఐసీడీఎస్ అధికారులు, సైకాలజిస్ట్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్, బాల రక్ష భవన్ కోఆర్డినేటర్, జిల్లా బాలల సంరక్షణ అధికారి, వాలంటరీ స్టేట్ కోఆర్డినేటర్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, ఇతర సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











