బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందజేసిన ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లను గ్రామ సర్పంచ్ గాండ్ల రాజేష్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమంలో భాగంగా జరిగింది.
మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు ఎం. ప్రశాంత్ కుమార్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజేష్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. పాఠశాలలో కార్పొరేట్ స్థాయి బోధనా వసతులను కల్పిస్తున్నామని, ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని ఆయన విద్యార్థులకు సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న నాణ్యమైన విద్య, డిజిటల్ తరగతులు, విశాలమైన తరగతి గదులు, అధునాతన ల్యాబ్లు, స్కాలర్షిప్లు, ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలను వినియోగించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సర్పంచ్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆయన వారికి సూచించారు.
మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి పాఠశాలకు, గ్రామానికి పేరు తీసుకురావాలని ఆయన ప్రోత్సహించారు. బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హాస్టల్ వసతి సౌకర్యం కూడా కల్పిస్తున్నామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.












