జిల్లాలో అనుమతులు లేకుండా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ అంశంపై వారు తమ ఆందోళన వ్యక్తం చేశారు.
బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నవాతే ప్రతాప్ మాట్లాడుతూ, జిల్లాలో అనుమతులు లేని పాఠశాలలు విచ్చలవిడిగా వెలుస్తున్నాయని, అయితే జిల్లా విద్యాశాఖ యంత్రాంగం వాటిపై చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోందని విమర్శించారు. అధికారులు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నారని, క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించడం లేదని ఆయన ఆరోపించారు.
అనేక పాఠశాలల్లో సొంత భవనాలు లేవని, రేకుల షెడ్లలో, సరైన మౌలిక వసతులు లేని గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నారని, దీనివల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నాయకులు పేర్కొన్నారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా మరుగుదొడ్ల సౌకర్యం లేదని, దాదాపు 80 శాతం పాఠశాలల్లో ఆట స్థలాలు కూడా లేవని వారు తెలిపారు.
విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తున్న అధికారుల తీరును విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయని, గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోకపోతే ఎంఈఓ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. అవసరమైతే జిల్లా విద్యాధికారి కార్యాలయం వద్ద కూడా ఆందోళనలు చేస్తామని స్పష్టం చేశారు.












