నిత్యం మద్యం సేవించి వేధింపులకు పాల్పడుతున్న సహజీవనం చేస్తున్న వ్యక్తిని ఓ మహిళ తన కుమారుడితో కలిసి దారుణంగా హత్య చేసింది. ఈ ఘాతుకానికి పాల్పడే ముందు, నిందితుడు 'ఒకరిని ఎలా చంపాలి' అని అంతర్జాలంలో వెతకడం కలకలం రేపుతోంది.
బాలానగర్‌లోని సూర్య ఇంజనీరింగ్ వర్క్స్‌లో కూలీగా పనిచేస్తున్న సమయంలో గార్లపల్లి అరుణకు, కానాల శివరెడ్డికి 10 ఏళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది కాస్తా సహజీవనానికి దారితీయడంతో, అరుణ తన కుమారుడు సాయి రత్నంతో కలిసి అతడితో పాటు నివాసం ఉంటూ వస్తోంది. గత పది నెలలుగా చింతల్‌లోని చెరుకుపల్లి కాలనీలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అయితే, శివరెడ్డికి మద్యం వ్యసనం ఉంది. నిత్యం మద్యం సేవించి వచ్చి అరుణను, ఆమె కుమారుడిని శారీరకంగా, మానసికంగా వేధించేవాడు.
శివారెడ్డి వేధింపులు రోజురోజుకూ ఎక్కువ కావడంతో విసిగిపోయిన తల్లీకొడుకులు అతన్ని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం, అరుణ కుమారుడు సాయిరత్నం నేరానికి ముందు గూగుల్‌లో 'హౌ టు కిల్' అని సెర్చ్ చేశాడు. అనంతరం మటన్ కోసేందుకని నమ్మించి సమీపంలోని చికెన్ షాపు నుంచి ఒక కత్తిని తీసుకొచ్చాడు. ఈ నెల 3వ తేదీ రాత్రి 11 గంటల నుంచి 12.30 గంటల ప్రాంతంలో మద్యం మత్తులో వచ్చిన శివరెడ్డి వారితో తీవ్రంగా గొడవపడ్డాడు. ఆ తర్వాత నిద్రలోకి జారుకున్నాడు. ఇదే అదనుగా భావించిన అరుణ, సాయిరత్నం నిద్రిస్తున్న శివారెడ్డి మెడపై కత్తితో దాడి చేసి ప్రాణాలు తీశారు.
హత్య అనంతరం ఆధారాలు లేకుండా చేసేందుకు ఘటనా స్థలంలో రక్తపు మరకలను శుభ్రం చేశారు. రక్తపు మరకలు ఉన్న తమ బట్టలను తీసుకెళ్లి సమీపంలోని కాలువలో పడేశారు. శివరెడ్డి మృతదేహాన్ని ఫ్లోర్ మ్యాట్, ప్లాస్టిక్ కవర్లలో చుట్టి తాళ్లతో కట్టేశారు. ఎవరికీ అనుమానం రాకుండా నిర్మానుష్య ప్రదేశంలో పడేసేందుకు ప్రణాళిక రచించారు. ఈలోపు చుట్టుపక్కల వారు ఇంటి యజమానికి గొడవ విషయం తెలపడంతో పోలీసులకు సమాచారం అందింది.
సకాలంలో స్పందించిన జీడిమెట్ల పోలీసులు మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్నారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితులైన అరుణ, సాయిరత్నంలను మే 4వ తేదీ సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. నేరానికి ఉపయోగించిన కత్తి, రక్తపు బట్టలు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ నంద్యాల కోటిరెడ్డి వివరాలను వెల్లడించారు.







