కరీంనగర్ జిల్లాలోని పీఎంజే జ్యువెలరీ షాపులో జరిగిన రెండు కోట్ల రూపాయల గన్‌పాయింట్ దోపిడీ కేసుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా దృష్టి సారించారు. 50 గంటలు గడిచినా నిందితుల ఆచూకీ లభించకపోవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, కేసును అత్యంత సీరియస్‌గా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు, నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దర్యాప్తులో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరించినట్లు సమాచారం.
దోపిడీకి పాల్పడిన దుండగులు వదిలివెళ్లిన బ్యాగుపై "ఐ లవ్ నందుర్బార్" అని ఉండటం కేసులో కీలక క్లూగా మారింది. దీని ఆధారంగా మహారాష్ట్రలోని నందుర్బార్ ప్రాంతంతో నిందితులకు సంబంధం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తూ దర్యాప్తు చేస్తున్నారు.
నిందితులను పట్టుకునేందుకు 16 బృందాలు రంగంలోకి దిగాయి. రాష్ట్ర సరిహద్దులు దాటి కూడా అన్వేషణ కొనసాగుతోంది. సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా విశ్లేషణల ద్వారా నిందితుల కదలికలను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.







