ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎర్రచందన అక్రమ రవాణా నిరోధక దళం (RSASTF) చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో కీలక పురోగతి సాధించింది. సుమారు 3 సంవత్సరాలుగా తప్పించుకొని తిరుగుతున్న కేరళకు చెందిన ప్రధాన అంతర రాష్ట్ర స్మగ్లర్ నాసర్ కె.ఎన్ @ నాసర్ భాయిని RSASTF బృందం అరెస్ట్ చేసింది. అతని వద్ద నుండి 1.95 కోట్ల రూపాయల విలువైన 76 ఎర్రచందనం దుంగలు, రెండు కార్లు, ఒక గూడ్స్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
RSASTF హెడ్ SP శ్రీ L. సుబ్బారాయుడు, IPS గారి మార్గదర్శకత్వంలో, Addl. SP శ్రీ J. కులశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ నిర్వహించబడింది. తెల్లవారుజామున అందిన సమాచారంతో టాస్క్ ఫోర్స్ బృందం, అటవీ సిబ్బంది కలిసి ఈ చర్యలు చేపట్టారు. పట్టుబడిన స్మగ్లర్ నాసర్, గత 10 సంవత్సరాలుగా తమిళనాడులోని కూలీల సహాయంతో శేషాచలం అడవుల నుండి ఎర్రచందనం దుంగలను కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు.
పట్టుబడిన స్మగ్లర్ నాసర్ (55), కేరళ రాష్ట్రంలోని పలఖడ్ టౌన్ మరియు జిల్లాకు చెందినవాడు. అతనితో పాటు మరో ముగ్గురు వ్యక్తులు తప్పించుకొని పారిపోయినట్లు సమాచారం. వీరిని పట్టుకోవడానికి దర్యాప్తు కొనసాగుతోంది. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోని ఇతర ప్రధాన స్మగ్లర్లను అరెస్ట్ చేయడానికి కూడా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయబడ్డాయి.
ఈ స్మగ్లింగ్ నెట్వర్క్లో ఇతర ప్రధాన సూత్రధారులను గుర్తించి, వారిని కూడా అరెస్ట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. RSASTF బృందం చేపట్టిన ఈ విజయవంతమైన ఆపరేషన్ను, అంతర రాష్ట్ర స్మగ్లర్ను అరెస్ట్ చేసినందుకు టాస్క్ ఫోర్స్ బృందాన్ని అభినందిస్తూ, వారికి రివార్డులు ప్రకటించినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఎర్రచందనం అక్రమ రవాణాను నివారించడానికి, స్మగ్లింగ్ చేసేవారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.











