అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించి, ఐదేళ్ల బాలుడిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన తల్లి, ఆమె ప్రియుడిని కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
కామారెడ్డిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో నివసిస్తున్న దొబ్బుల రమేష్ భార్య లక్ష్మి అలియాస్ రజిత, తన ఇద్దరు పిల్లలు సమీర (8), శ్రావణ్ (5) లతో కలిసి ఉంటోంది. భర్తతో విభేదాల కారణంగా విడిగా ఉంటున్న రజిత, రాజలిపేట లక్ష్మీనర్సింలు అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. వీరిద్దరూ తమ ఏకాంతానికి బాలుడు శ్రావణ్ అడ్డుగా ఉన్నాడని భావించి, అతడిని హత్య చేయాలని కుట్ర పన్నారు.
ఈ నెల 17వ తేదీ సాయంత్రం, రజిత ఇంట్లో లేని సమయంలో లక్ష్మీనర్సింలు బాలుడిపై దాడి చేశాడు. కళ్లలో కారం కొట్టి, గొంతు నులిమి అత్యంత క్రూరంగా హత్య చేశాడు. అనంతరం బాత్రూంలో పడిపోయాడని నాటకమాడి, బాలుడిని ఆసుపత్రికి తరలించాడు. అయితే, అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు, ఏఎస్పీ బి. చైతన్య పర్యవేక్షణలో పట్టణ ఇన్స్పెక్టర్ బి. నరహరి కేసును లోతుగా దర్యాప్తు చేశారు. పోలీసుల విచారణలో నిందితులు హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతోనే ఈ హత్యకు పథకం రచించినట్లు తెలిపారు.
నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేసి, కోర్టుకు హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు.












