అక్రమ గంజాయి, మాదకద్రవ్యాల రవాణాను అరికట్టేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో రామగుండం రైల్వే స్టేషన్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో నార్కోటిక్ స్నిఫర్ డాగ్‌తో పాటు ప్రత్యేక బృందాలు పాల్గొన్నాయి.
నేరాల నియంత్రణ, యువత ఆరోగ్యాన్ని కాపాడే లక్ష్యంతో ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి ఆదేశాల మేరకు రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ సంధ్యారాణి, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్ పర్యవేక్షణలో ఈ కార్యకలాపాలు జరిగాయి.
తనిఖీల్లో భాగంగా రైల్వే స్టేషన్ పరిసరాలు, పార్సెల్ కార్యాలయాలు, మహారాష్ట్ర నుంచి వచ్చే రైళ్ల బోగీలు, ప్రయాణికుల బ్యాగులు, అనుమానాస్పద పార్సిళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. గంజాయి, నిషేధిత డ్రగ్స్ రవాణాను అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఈ తనిఖీలు కొనసాగాయి.
మాదకద్రవ్యాల రవాణా, అమ్మకాలు, గంజాయి సాగు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఇప్పటికే కొందరు విక్రయదారులపై సస్పెక్ట్ షీట్లు తెరిచి, వారిపై నిఘా పెంచినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి రైల్వే మార్గంలో గంజాయి రవాణా జరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.










