కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక క్రిమినల్ కేసులో పరారీలో ఉన్న నిందితుడు మంత్రి రాఘవేందర్ రావును కోర్టు ముందు హాజరుకావాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కమ్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. హాజరుకాకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం కనకమడుగు గ్రామానికి చెందిన మంత్రి రాఘవేందర్ రావు (32), ప్రస్తుతం నాగారం గ్రామంలోని శ్రీనివాస నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇతనిపై కీసర పోలీస్ స్టేషన్లో భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కింద కేసు నమోదైంది. ఈ కేసు (SC నంబర్: 245/2011) విచారణలో భాగంగా నిందితుడు కోర్టుకు హాజరుకాకుండా పరారీలో ఉన్నాడు.
నిందితుడిని అదుపులోకి తీసుకోవడానికి గతంలో కోర్టు జారీ చేసిన వారెంట్లు అమలు చేయడానికి పోలీసులు ప్రయత్నించినప్పటికీ, అతను దొరక్కుండా దాచుకుంటున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో కోర్టు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 82, 83 (ప్రస్తుతం BNSS 84, 85) ప్రకారం అధికారిక ప్రకటన జారీ చేసింది.
న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, పరారీలో ఉన్న నిందితుడు మంత్రి రాఘవేందర్ రావు ఈ నెల 08-04-2026న మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ముందు స్వయంగా హాజరుకావాలని స్పష్టం చేశారు. నిర్ణీత గడువులోగా హాజరుకాకపోతే తదుపరి చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.










