రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల పరిష్కారం, దర్యాప్తు వేగవంతంపై పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఈ విషయాలపై సమగ్రంగా చర్చించారు.
పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తులో ఉన్న కేసుల పురోగతి, వారెంట్ల అమలు, పోలీస్ సిబ్బంది పనితీరు వంటి అంశాలపై లోతైన సమీక్ష జరిగింది. దర్యాప్తులో జాప్యం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, బాధితులకు సత్వర న్యాయం అందించేలా న్యాయాధికారులతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.
దొంగతనాల నివారణ, కేసుల ఛేదనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని సీపీ సూచించారు. రికవరీ శాతాన్ని పెంచి, బాధితులకు వారి ఆస్తులను తిరిగి అందించేలా చర్యలు తీసుకోవాలని, దొంగతనం కేసుల్లో నిందితులపై హిస్టరీ షీట్లు తెరవాలని ఆదేశించారు. నేరాలు జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటును ప్రోత్సహించాలని, ప్రజల భాగస్వామ్యంతో వీటిని ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికే ఉన్న కెమెరాల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.
ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను (బ్లాక్ స్పాట్స్) గుర్తించి, సంబంధిత శాఖలతో కలిసి నివారణ చర్యలు చేపట్టాలని సీపీ సూచించారు. 'అరైవ్-అలైవ్' కార్యక్రమం ద్వారా ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని, మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించి, వారి ఫిర్యాదులపై సత్వర స్పందన ఇవ్వాలని, పెట్రోలింగ్ వాహనాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. గంజాయి, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెంచి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.











