పోషించే స్తోమత లేదని, ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారనే కారణంతో నవజాత శిశువును రూ.3 లక్షలకు విక్రయించిన తల్లిదండ్రులు, మధ్యవర్తులు, కొనుగోలుదారులతో సహా 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లి తాండాలో చోటుచేసుకుంది.
పోతిరెడ్డిపల్లి తాండాకు చెందిన దేవీసింగ్, శిరీష దంపతులకు ఈ ఏడాది మార్చిలో మెదక్ మాతా శిశు కేంద్రంలో నాలుగో ఆడబిడ్డ జన్మించింది. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ దంపతులు, బిడ్డను పెంచలేమని నిర్ణయించుకున్నారు. మధ్యవర్తుల సహాయంతో రూ.3 లక్షలకు శిశువును అమ్మకానికి పెట్టారు.
సిద్ధిపేట జిల్లా అల్లీనగర్ ప్రాంతానికి చెందిన సంతానం లేని కమలమ్మ, లింగయ్య దంపతులు ఈ శిశువును కొనుగోలు చేశారు. ప్రసవం అనంతరం తల్లి వద్ద బిడ్డ కనిపించకపోవడంతో, అనుమానం వచ్చిన అంగన్వాడీ సిబ్బంది ఆరా తీశారు. విచారణలో శిశు విక్రయం జరిగినట్లు తేలడంతో, ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారు.
ఐసీడీఎస్ అధికారులు తండాలో విచారణ జరిపి, శిశు విక్రయం జరిగినట్లు నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, శిశువు తల్లిదండ్రులు, మధ్యవర్తులు, కొనుగోలు చేసిన దంపతులతో సహా మొత్తం 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.











