మైనర్ అమ్మాయిలతో లైంగిక సంబంధాలు కలిగి ఉండటం తీవ్రమైన చట్టపరమైన పరిణామాలకు దారితీస్తుందని న్యాయనిపుణులు హెచ్చరిస్తున్నారు. 'మైనర్' అనే పదం కేవలం వయసు తక్కువ అని మాత్రమే కాకుండా, పరిణితి లేనివారిని సూచిస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ సంబంధాలు పోక్సో చట్టం కిందకు వస్తాయని, దీని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని తెలిపారు.
ఒక మైనర్ అమ్మాయి తన పూర్తి స్పృహతో, ఇష్టంతో శారీరక సంబంధానికి ఒప్పుకున్నా సరే, చట్టం దానిని 'రేప్' కిందనే పరిగణిస్తుంది. 'ఆమె నన్ను ప్రేమించింది, ఆమె నన్ను పిలిచింది' వంటి వాదనలు కోర్టులో చెల్లుబాటు కావు. మైనర్లకు నిర్ణయం తీసుకునే పరిణితి లేదని చట్టం దృఢంగా విశ్వసిస్తుంది.
మైనర్ల విషయంలో 'ఇష్టంగానే పడుకుంది' అనే వాదనలు వితండవాదమని, ఇది చట్టం దృష్టిలో నేరమే అవుతుందని న్యాయనిపుణులు స్పష్టం చేశారు. పోక్సో చట్టం ప్రకారం, ప్రేమించుకున్నామని, ఇద్దరికీ ఇష్టమేనని కొందరు అబ్బాయిలు భ్రమలో ఉంటారని, అయితే అమ్మాయి తల్లిదండ్రులకు తెలిస్తే ఈ చట్టం వారికి వజ్రాయుధంగా మారుతుంది.
ఒకసారి FIR నమోదైతే, ఆ అబ్బాయి జీవితం పీడకలగా మారుతుంది. సాధారణ కేసుల్లాగా వెంటనే బెయిల్ రావడం అసాధ్యం, నెలల తరబడి జైల్లోనే ఉండాల్సి వస్తుంది. సాధారణ కేసుల్లో 'నేరం నిరూపితమయ్యే వరకు నిందితుడు నిర్దోషి' అయితే, పోక్సో కేసుల్లో 'నిర్దోషి అని నిరూపించుకునే వరకు మీరు నేరస్తుడే' అని, అంటే భారం మొత్తం నిందితుడిపైనే ఉంటుంది.
ఈ కేసుల వల్ల భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీల్లో అవకాశాలు, విదేశాలకు వెళ్లే అవకాశాలు శాశ్వతంగా మూసుకుపోతాయి. కేవలం అబ్బాయే కాకుండా మొత్తం కుటుంబం మానసిక క్షోభను అనుభవించాల్సి వస్తుంది. అమ్మాయి తరపు వారు రాజీపడినా, కేసు వెనక్కి తీసుకుంటామని చెప్పినా కోర్టు అంగీకరించదు. ఇది ప్రభుత్వానికి, నిందితుడికి మధ్య జరిగే స్టేట్ కేసు, దీని కోసం ప్రత్యేక పోక్సో కోర్టులు ఉంటాయి, ఇక్కడ విచారణ వేగంగా జరిగి, కఠిన శిక్షలు ఉంటాయి.









