మద్దూరు మండలం మోమినపుర్ గ్రామంలోని ZPHS పాఠశాలలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో 7 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS తెలిపిన వివరాల ప్రకారం, ప్రభుత్వ ఉపాధ్యాయుడు చండేపల్లి స్వామి తన అధికారాన్ని దుర్వినియోగం చేసి బాలికతో అనుచితంగా ప్రవర్తించినట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను దాచిపెట్టడం, అనధికారికంగా పంచుకోవడం వంటి చర్యలకు ఇతర నిందితులు పాల్పడ్డారు.
డీఎస్పీ నల్లపు లింగయ్య చేపట్టిన విచారణలో, ప్రధాన నిందితుడు బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు వెల్లడైంది. అతనికి సహకరించిన వ్యక్తులపై పోక్సో, ఐటీ, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు.
సీసీ కెమెరాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, మొత్తం 7 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్పీ తెలిపారు. విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ఇలాంటి ఘటనలు ఎక్కడైనా జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని లేదా అత్యవసర సమయాల్లో డయల్ 100, 112, 1098 నంబర్లకు తెలియజేయాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. నేరాలను దాచిపెట్టే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.











