మహబూబాబాద్ జిల్లాలో అక్రమ సారాయి తయారీకి వినియోగిస్తున్న భారీ మొత్తంలో నల్లబెల్లాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
కురవి శివారులోని సోమ్లా తండా వద్ద టాస్క్ ఫోర్స్, కురవి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో లారీలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 8 లక్షల రూపాయల విలువైన 70 క్వింటాళ్ల నల్లబెల్లం, 10 క్వింటాళ్ల పట్టికను గుర్తించారు. దీంతో పోలీసులు నల్లబెల్లం, పట్టికతో పాటు లారీని సీజ్ చేశారు.
ఈ అక్రమ రవాణాకు పాల్పడిన గుగులోత్ సుమన్ (మహబూబాబాద్), ఆరెపల్లి మధు, బొల్లా విజయ్ కుమార్ అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
అక్రమ సారాయి తయారీని అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా సారించారు. ఈ ఆపరేషన్లో టాస్క్ ఫోర్స్ CI హతీరామ్, SI తాహేర్ బాబా, కురవి SI గండ్రాతి సతీష్, SI జయకుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని అధికారులు సూచించారు.











