ఒకే వ్యక్తి 33 ఏళ్ల పాటు రెండు వేర్వేరు ప్రభుత్వ శాఖల్లో నకిలీ పత్రాలతో ఉద్యోగాలు చేస్తూ, రెండు జీతాలు పొందిన వ్యవహారం ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడికి 7 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.30 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ వ్యవస్థను మూడు దశాబ్దాలకు పైగా మోసం చేసిన సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. బారాబంకి జిల్లాకు చెందిన జయప్రకాష్ సింగ్ అనే వ్యక్తి నకిలీ పత్రాల ఆధారంగా ఒకేసారి రెండు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు చేస్తూ, 33 ఏళ్ల పాటు రెండు జీతాలు మరియు ఇతర సౌకర్యాలు పొందినట్లు విచారణలో బయటపడింది. సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం, జయప్రకాష్ సింగ్ 1979 డిసెంబర్ 26న ప్రతాప్‌గఢ్ జిల్లాలో ‘నాన్ మెడికల్ అసిస్టెంట్’గా నియమితులయ్యారు. ఆ తర్వాత 1993 జూన్‌లో బారాబంకి జిల్లాలోని ప్రాథమిక విద్యాశాఖలో ఉపాధ్యాయుడిగా చేరారు. ఈ రెండు ఉద్యోగాలను ఒకేసారి నిర్వహిస్తూ, దశాబ్దాల పాటు రెండు శాఖల నుంచి జీతభత్యాలు పొందినట్లు విచారణలో తేలింది. ఈ మోసం గురించి 2009 ఫిబ్రవరి 20న ప్రభాత్ సింగ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
నకిలీ పత్రాల ద్వారా మోసపూరితంగా ఉద్యోగాలు పొందినట్టు ఆరోపణలు రావడంతో విచారణ ప్రారంభమైంది. వాదోపవాదాలు, సాక్ష్యాధారాలు పరిశీలించిన అనంతరం ప్రధాన న్యాయమూర్తి సుధా సింగ్ నిందితుడిని దోషిగా తేల్చారు. అతనికి 7 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.30 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ తీర్పుపై విస్తృత చర్చ నెలకొంది.
మూడు దశాబ్దాల పాటు ప్రభుత్వాన్ని మోసం చేసి కోట్ల రూపాయల ప్రయోజనం పొందిన వ్యక్తికి కేవలం 7 ఏళ్ల జైలు శిక్ష, స్వల్ప జరిమానా సరిపోతుందా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. నిపుణులు, సామాజిక వర్గాలు ఈ కేసులో అక్రమంగా పొందిన మొత్తం జీతాన్ని వడ్డీతో సహా వసూలు చేయాలని అభిప్రాయపడుతున్నాయి. ప్రభుత్వ నియామకాల్లో పారదర్శకత, కఠిన పర్యవేక్షణ అవసరమనే డిమాండ్లు మరింతగా వినిపిస్తున్నాయి.







