కీసర పట్టణంలో పట్టపగలే తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగిలించిన బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.
సుభాష్ నగర్ కాలనీకి చెందిన ఆరుమళ్ల వెంకట్ రెడ్డి ఈ నెల 16న ఉదయం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లగా, మధ్యాహ్నం తిరిగి వచ్చి చూసేసరికి తాళం పగలగొట్టి ఉంది. లోపల అల్మారాలో ఉన్న బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్ మాయమైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కీసర పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరాల సహాయంతో దర్యాప్తు ముమ్మరం చేశారు.
పోలీసులు కీసర ప్రాంతానికి చెందిన బాల నేరస్థుడు దర్యాగుల జగదీష్ (అలియాస్ సంతోష్, అలియాస్ సంతు)ను బుధవారం అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి చోరీకి గురైన సొత్తును పూర్తిగా రికవరీ చేశారు.
నిందితుడిని కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. ఇళ్లలో భద్రతా చర్యలు తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులను గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.










