కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రతి పనికి రేట్లు ఫిక్స్ చేసి లంచాలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, సోమవారం ఏసీబీ అధికారులు కార్యాలయంలో విస్తృత తనిఖీలు నిర్వహించి పలు అక్రమాలను వెలుగులోకి తెచ్చారు.
మున్సిపాలిటీలో ప్రతి పనికి అధికారులు రేట్లు నిర్ణయించి, లంచాలు తీసుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఫైళ్లు కదిలించడానికి డబ్బులు ఇవ్వాల్సి వస్తోందని, లేదంటే కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు.
ఈ ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం మున్సిపల్ కార్యాలయంలో దాదాపు 8 గంటలపాటు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు అక్రమాలు బయటపడినట్లు సమాచారం. దీంతో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల్లో ఆందోళన నెలకొంది.
ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో భారీ స్థాయిలో అవినీతి జరిగినట్లు ఏసీబీ గుర్తించినట్లు తెలుస్తోంది. భవన నిర్మాణ అనుమతుల్లో జాప్యం వెనుక లంచాల వ్యవహారమే ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏసీబీ దాడుల సమయంలో కొందరు అధికారులు విధులకు హాజరు కాకపోవడం, ముందస్తు సమాచారం లీక్ అయిందన్న అనుమానాలను పెంచుతోంది.
ఏసీబీ దాడుల నేపథ్యంలో పలువురు కౌన్సిలర్లు, స్థానిక నాయకుల్లోనూ ఆందోళన నెలకొంది. అనధికార నిర్మాణాలు, లైసెన్సుల రీన్యూవల్ వంటి వ్యవహారాల్లో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఔట్సోర్సింగ్ కార్మికుల జీతాల విషయంలోనూ అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది.










