పెదకాకాని మండలం, తక్కెళ్లపాడులో ఆదివారం రాత్రి సెల్‌ఫోన్ ఇవ్వనందుకు బంధువుపై కత్తితో దాడి జరిగిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ దాడిలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు.
పోలీసుల కథనం ప్రకారం, నంబూరుకు చెందిన డ్రైవర్ షేక్.బాషా, తన స్కూటీ, సెల్‌ఫోన్‌ను సమీప బంధువు షేక్.గౌస్ వద్ద తాకట్టు పెట్టారు. నగదు చెల్లించినా సెల్‌ఫోన్ తిరిగి ఇవ్వకపోవడంతో ఇరువర్గాల మధ్య వారం రోజులుగా వివాదం కొనసాగుతోంది.
ఆదివారం రాత్రి సెల్‌ఫోన్ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం ముదిరింది. ఈ క్రమంలో గౌస్ రెచ్చగొట్టడంతో, బాషా సమీపంలోని ఇంట్లోకి వెళ్లి కత్తి తెచ్చి గౌస్‌పై దాడి చేశాడు. గౌస్ అడ్డుకోవడంతో అతని అరచేయి తీవ్రంగా గాయపడింది.
తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన గౌస్‌ను, దాడి చేసిన బాషా తన స్కూటీపై గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి పరారయ్యాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
నిందితుడైన బాషా కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు దర్యాప్తులో వెల్లడి కానున్నాయి.






