నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మజిపేటలో ఎస్సై హరిప్రసాద్ రెడ్డి రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఈ ఘటనతో స్థానికులు సంబరాలు చేసుకున్నారు.
ఇసుక అక్రమ రవాణా కేసులో సీజ్ చేసిన ట్రాక్టర్, జేసీబీలను వదిలిపెట్టడానికి ఎస్సై హరిప్రసాద్ రెడ్డి బాధితుడి నుండి రూ.25 వేలు లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో అప్రమత్తమైన ఏసీబీ అధికారులు, వల పన్ని ఎస్సైని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఎస్సై అవినీతిపై ఆగ్రహించిన బాధితులు, స్థానికులు అంబేద్కర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. 'అవినీతి ఎస్సై డౌన్ డౌన్' అంటూ నినాదాలు చేశారు. తమను తీవ్రంగా వేధించిన ఎస్సైపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
బాధితుల ఆరోపణల ప్రకారం, ఎస్సై హరిప్రసాద్ రెడ్డి చాలా మందిని డబ్బుల కోసం వేధించడంతో పాటు, దారుణంగా కొట్టేవారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల పేరుతో డబ్బులు వసూలు చేశారని, భూతగాదాలు, సివిల్ కేసుల్లో తలదూర్చి డబ్బులు దండుకున్నారని బాధితులు ఆరోపించారు.
ఏసీబీ అధికారులు ఎస్సై హరిప్రసాద్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.











