మంగళగిరిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈగల్ (Eagle) ప్రధాన కార్యాలయాన్ని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఈగల్ పనితీరు, గంజాయి నిర్మూలన, డ్రగ్స్ నివారణ చర్యలపై పలు కీలక ప్రకటనలు చేశారు.
డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, ఈగల్ యూనిట్‌ను ఒక ప్రీమియర్ ఆర్గనైజేషన్‌గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. గత ఏడాదిన్నర కాలంలో ఈగల్ పనితీరుకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని, గ్రేహౌండ్స్ తరహాలో ఈ యూనిట్ ఎదుగుతోందని ఆయన పేర్కొన్నారు.
గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించడమే తమ లక్ష్యమని, జీరో కల్టివేషన్ సాధించేందుకు కఠిన చర్యలు చేపడుతున్నామని డీజీపీ స్పష్టం చేశారు. ఎన్డీపీఎస్ యాక్ట్ అమలులో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని, ఇప్పటివరకు 112 ఎన్డీపీఎస్ కేసులు నమోదు చేయగా, ఈ లక్ష్యాన్ని 200 కేసులకు పెంచే యోచనలో ఉన్నట్లు చెప్పారు. హ్యాబిచువల్ నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
డ్రగ్ గ్యాంగ్స్ ఆర్థిక వనరులపై దాడులు కొనసాగుతాయని, డ్రగ్ వినియోగదారులపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభమైందని, రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. మొదటి దశలో 10 వేల టెస్టింగ్ కిట్లను వినియోగించనున్నట్లు వెల్లడించారు.
గంజాయి నిర్మూలనకు డ్రోన్స్, సాటిలైట్ల సాంకేతికతను ఉపయోగిస్తామని, డార్క్ వెబ్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌పై నిఘా కొనసాగుతుందని తెలిపారు. డేటా సెంటర్ ద్వారా క్రైమ్ అనలిటిక్స్ చేపడతామని, డ్రగ్స్ టెర్రరిజం లాంటి ప్రమాదకరమైనవని డీజీపీ అభివర్ణించారు. డ్రగ్ ఫ్రీ సొసైటీని లక్ష్యంగా చేసుకుని ఈగల్ చర్యలు చేపడుతోందని, ఇంటర్ స్టేట్ డ్రగ్ నెట్‌వర్క్‌లపై ప్రత్యేక దృష్టి సారించామని, 13 కొత్త ఎన్డీపీఎస్ కోర్టుల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు.











