శుభక్షేత్ర ప్రై. లిమిటెడ్ పేరుతో జరిగిన భారీ ఆర్థిక మోసం కేసులో సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో గాయని మంగ్లీ సోదరుడు శివ, రమావత్ మధు, హేమకాంత్ రెడ్డి ప్రధాన నిందితులుగా ఉన్నట్లు గుర్తించారు.
పోలీసులు ఇప్పటికే రమావత్ మధును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ముఠా గతంలో నల్లగొండ జిల్లాలో గోకుల నంద ఇన్ఫ్రా పేరుతో కూడా రూ.కోట్లలో మోసాలకు పాల్పడినట్లు సీఐడీ 5 కేసులు నమోదు చేసింది. 'ఏకం విత్ నేచర్' థీమ్‌తో శుభక్షేత్ర ప్రై. లిమిటెడ్ పేరుతో పెట్టుబడులు ఆహ్వానించి, రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే 101 గజాల స్థలం రిజిస్ట్రేషన్ తో పాటు, నెలకు 5 శాతం చొప్పున 42 నెలల పాటు రిటర్న్స్ వస్తాయని నమ్మించి మోసం చేసినట్లు సమాచారం.
సైబరాబాద్ పోలీసులు ఏప్రిల్ 17న రమావత్ మధును రిమాండ్‌కు తరలించగా, ప్రధాన నిందితులైన శివ, హేమకాంత్ రెడ్డి, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. జైల్లో ఉన్న రమావత్ మధును పోలీస్ కస్టడీకి కోరుతూ సైబరాబాద్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం మధును కస్టడీకి అనుమతించే అవకాశం ఉంది.
ఈ కేసులో గాయని మంగ్లీ పాత్రపై కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పలు సాంకేతిక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్న నిందితులు శివ, హేమకాంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల-తిరుపతిలో తలదాచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితులు, గిరిజన సంఘాల నాయకులు ఈ మోసంలో మంగ్లీ, ఆమె సోదరుడి పాత్ర కీలకమని ఆరోపిస్తున్నారు.











