జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు, సంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.సౌజన్య సోమవారం శిశు గృహ, జువైనల్ జస్టిస్ బోర్డు మరియు సఖి కేంద్రాలను సందర్శించి, అక్కడి వాతావరణం, పిల్లల సంరక్షణ, బాధితుల సమస్యల పరిష్కారంపై అధికారులకు సూచనలు అందించారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.భవాని చంద్ర ఆదేశాల మేరకు జరిగిన ఈ తనిఖీలో, పిల్లల సంరక్షణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, క్రమశిక్షణతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని బి.సౌజన్య సూచించారు.
సఖి కేంద్రానికి వచ్చే బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులకు సూచించారు. జువైనల్ జస్టిస్ బోర్డులో బాలల హక్కులపై అవగాహన కల్పించారు.
న్యాయ సేవలు అవసరమైన వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తామని, దీనికోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జువైనల్ జస్టిస్ బోర్డు జడ్జి కే.ధనలక్ష్మి, సఖి, శిశు గృహ అధికారులు పాల్గొన్నారు.











