తెలంగాణ బయోఫార్మా రంగంలో మరో కీలక ముందడుగు పడింది. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బోర్పట్ల శివారులో అత్యాధునిక తెరానిమ్ బయోలాజిక్స్ (TheraNym Biologics) తయారీ యూనిట్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం ప్రారంభించారు. ఈ యూనిట్ రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి నూతన ఊతాన్ని అందిస్తుందని మంత్రులు పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, పారదర్శక విధానాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉండటంతో ప్రపంచ స్థాయి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. బయోటెక్నాలజీ, ఔషధ రంగాల్లో తెలంగాణ ఇప్పటికే దేశంలో అగ్రగామిగా నిలిచిందని, తెరానిమ్ బయోలాజిక్స్ వంటి సంస్థల రాకతో రాష్ట్రం అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు పొందుతుందని ఆయన అన్నారు.
ఈ సంస్థ ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి కూడా దోహదం చేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. అత్యాధునిక బయోలాజికల్ ఔషధాల తయారీలో ఈ యూనిట్ కీలక పాత్ర పోషించనుందని, వైద్యరంగంలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు ఇలాంటి సంస్థలు బలాన్ని చేకూరుస్తాయని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
సంగారెడ్డి జిల్లా ఔషధ, బయోటెక్నాలజీ రంగాలకు ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందని, పరిశ్రమల విస్తరణతో పాటు స్థానిక ప్రజల జీవనోపాధి అవకాశాలు కూడా గణనీయంగా మెరుగుపడతాయని మంత్రి రాజనర్సింహ అన్నారు. పరిశ్రమలు అభివృద్ధి చెందడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహించాలని సంస్థలకు సూచించారు.












