సంగారెడ్డిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా, శిశు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జయప్రకాశ్ రెడ్డి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి సౌజన్యలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, అన్ని రంగాల్లో తమ ప్రత్యేకతను చాటుకుంటూ సమాజ అభివృద్ధికి తోడ్పడుతున్నారని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. మహిళలకు ప్రోత్సాహం కల్పించి వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తే అన్ని రంగాల్లో ఉన్నతంగా రాణించగలరని తెలిపారు.
ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటోందని, అన్ని కార్యక్రమాల్లో మహిళలను భాగస్వామ్యులను చేస్తున్నామని అధికారులు తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలందరికీ పూర్తి ఆరోగ్య ప్రొఫైల్ రూపొందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని వెల్లడించారు.
కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే మహిళలు తమ ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన మహిళా ఉద్యోగులను మేమెంటో, సర్టిఫికెట్ అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ చేశారు.
బాలసదనం విద్యార్థులు, అంగన్వాడి టీచర్లు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు మరింత శోభను తెచ్చాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనిత సంతోష్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, డీఆర్డీవో జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.


