పెళ్లికి నిరాకరించిందన్న కక్షతో ప్రియుడి చేతిలో హెచ్ఐవి పాజిటివ్ రక్తం ఎక్కించబడిన ఘటనలో బాధితురాలిగా ఉన్న యువతి రమణి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన మేడ్చల్ జిల్లా అన్నోజిగూడలో చోటుచేసుకుంది.
పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్న రమణి, ఏప్రిల్ 10న తన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
గతంలో, రమణి తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందనే కక్షతో మనోహర్ అనే యువకుడు మార్చి 11వ తేదీన ఆమెకు ఎయిడ్స్ పాజిటివ్ ఉన్న రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది.
సంఘటన అనంతరం పోలీసులు మనోహర్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే, శరీరంలోకి ప్రమాదకర వైరస్ ప్రవేశించిందన్న భయం, సమాజంలో ఎదురయ్యే వివక్షను తలచుకుని రమణి గత కొన్ని రోజులుగా తీవ్ర మానసిక ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. ఈ ఆందోళనలే ఆమె ఆత్మహత్యకు దారితీసినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు గల కారణాలపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.












