కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మరణించిన సిబ్బంది పేర్లతో జీతాలు డ్రా చేస్తూ ప్రభుత్వ ధనాన్ని కాజేస్తున్న సుమారు రూ. 1.40 కోట్ల కుంభకోణాన్ని అధికారులు వెలికితీశారు. ఈ వ్యవహారంలో ఒక పోలీసు ఉద్యోగిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
టాస్క్ ఫోర్స్ ఏసీపీ విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం, గతంలో పే-సెక్షన్లో పనిచేసిన ఒక పోలీసు ఉద్యోగి, మరణించిన ముగ్గురు కానిస్టేబుళ్ల ఎంప్లాయీ ఐడీలను ఉపయోగించి, IFMIS పోర్టల్లో ఇతరుల పేర్లను చేర్చారు. ఈ క్రమంలో, నిందితుడు ప్రైవేట్ బ్యాంకుల్లో నకిలీ ఖాతాలను తెరిచి, వాటిని తన వ్యక్తిగత మొబైల్ నంబర్లతో అనుసంధానించి, 2022 నుండి 2026 వరకు ప్రభుత్వ జీతాల సొమ్మును అక్రమంగా పొందినట్లు తేలింది.
అక్రమంగా వచ్చిన సొమ్మును నిందితుడు వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడంతో పాటు, పర్సనల్ లోన్లు కూడా తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కుంభకోణంపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశాల మేరకు, సంబంధిత పోలీసు ఉద్యోగిపై కరీంనగర్ I-టౌన్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కరీంనగర్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాంచందర్ రావు మాట్లాడుతూ, ఈ కేసులో అంతర్గత విచారణ కొనసాగుతోందని, ఈ కుంభకోణంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. పూర్తి విచారణ అనంతరం, బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ గౌష్ ఆలం స్పష్టం చేశారు. ఈ కుంభకోణం పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపింది.











