రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కనీసం 30 శాతం నిధులు కేటాయించి, ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) సంగారెడ్డి జిల్లా కార్యదర్శి దత్తు రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు AISF నాయకులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
AISF జిల్లా కార్యదర్శి దత్తు రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు మౌలిక సదుపాయాల కొరతతో పాటు ఉపాధ్యాయుల ఖాళీలు, హాస్టళ్లలో వసతుల లేమి, స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల ఆలస్యం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేసి, కార్పొరేట్ విద్యాసంస్థలకు అనుకూల విధానాలు అమలు చేయడం వల్ల సాధారణ కుటుంబాల విద్యార్థులు నష్టపోతున్నారని విమర్శించారు. విద్య వ్యాపారం కాదని, ప్రతి విద్యార్థికి హక్కు అని ఆయన నొక్కి చెప్పారు.
ప్రభుత్వ విద్యా రంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వని పక్షంలో విద్యార్థులతో కలిసి AISF ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని దత్తు రెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా, విద్యారంగానికి 30% బడ్జెట్ కేటాయింపు, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, మౌలిక సదుపాయాల మెరుగుదల, హాస్టళ్లలో మెరుగైన వసతి, స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల వంటి అంశాలపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
వినతిపత్రం సమర్పించిన వారిలో సంగారెడ్డి పట్టణ కార్యదర్శి రాకేష్, మనోజ్, జిల్లా నాయకులు పుప్పాల అభిషేక్ తదితరులు ఉన్నారు.

