మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో రబీ (యాసంగి) 2025-26 సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 25వ తేదీ నుండి 15 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.
అదనపు జిల్లా కలెక్టర్ (పౌరసరఫరాలు) డి. విజయేందర్ రెడ్డి అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ధాన్యం కొనుగోలు చేసిన రోజే ట్యాబ్ ఎంట్రీలను పూర్తి చేయాలని, రైతులు విక్రయించిన ధాన్యానికి 48 గంటల్లోపే నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
గతంలో ట్యాబ్ ఎంట్రీలు ఆలస్యం కావడం వల్ల రైతులకు చెల్లింపులు ఆలస్యమైన సంఘటనలను ప్రస్తావిస్తూ, ఈసారి అలాంటివి జరగకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ధాన్యం సేకరణకు అవసరమైన గన్నీ బ్యాగులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.
రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే ముందు తడి, తాలు, దుమ్ము లేకుండా బాగా ఆరబెట్టి తీసుకురావాలని సూచనలు జారీ చేశారు. వరికోత సమయంలో యంత్రాల యజమానులతో సమన్వయం చేసుకుని, ధాన్యం క్రమపద్ధతిలో కేంద్రాలకు చేరేలా చూడాలని కోరారు.
ధాన్యం సేకరణ ప్రక్రియలో వ్యవసాయ, పౌరసరఫరాలు, మార్కెటింగ్, కోఆపరేటివ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, రైతుల సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలో నిరంతర సమీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.











