తెలంగాణలో ఈ యాసంగి సీజన్లో 90 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరించేందుకు 8,251 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియను పటిష్టంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై చర్చించారు. ఈ సీజన్లో 90 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
రైతులకు అవసరమైన గన్నీ బ్యాగుల లభ్యతపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే 16 కోట్లకు పైగా గన్నీ బ్యాగులు సిద్ధంగా ఉన్నాయని, కొరత లేకుండా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
సన్నరకాల వరి ధాన్యాలకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్‌గా అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, ఇది రైతులకు అదనపు ఆదాయాన్ని చేకూరుస్తుందని పేర్కొన్నారు.
అన్ని జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. మిల్లర్ల సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతామని తెలిపారు.











