ఉత్తరప్రదేశ్‌ను ప్రకృతి విపత్తు వణికించింది. ఈదురుగాలులు, భారీ వడగళ్ల వర్షం కారణంగా ఒక్కరోజులోనే 89 మంది మృతి చెందగా, 53 మంది గాయపడ్డారు. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి, పశువులు సైతం ప్రాణాలు కోల్పోయాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఈ సంఘటనలో 89 మంది ప్రాణాలు కోల్పోగా, 53 మందికి గాయాలయ్యాయి. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
ప్రకృతి వైపరీత్యం కారణంగా 114 పశువులు మరణించాయని, 87 ఇళ్లు ధ్వంసమయ్యాయని అధికారులు ప్రాథమిక నివేదికలు వెల్లడించారు. ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో మండే ఎండల మధ్య అకాల వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరిస్థితిపై ఆరా తీశారు. బాధితులకు తక్షణమే సహాయం అందించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.











