అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ (ఆత్మ) ఆధ్వర్యంలో పటాన్ చెరులోని సోలక్ పల్లి రైతు వేదికలో వరి సాగులో సమగ్ర యాజమాన్యంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎరువుల సమర్థ వినియోగం, అనువైన వరి వంగడాల ఎంపిక, సస్యరక్షణ చర్యలు వంటి అంశాలపై చర్చించారు.
ఆత్మ కమిటీ ఛైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, వరిలో నీటి యాజమాన్యం, ఎరువుల సమతుల్య వినియోగం, పురుగు మందుల వాడకం వంటి అంశాలపై రైతులకు వివరించారు. సరైన పద్ధతులు అనుసరించడం ద్వారా దిగుబడి పెరిగి, ఖర్చులు తగ్గుతాయని ఆయన సూచించారు.
రైతు శాస్త్రవేత్త డా. కే.రాహుల్ విశ్వకర్మ మాట్లాడుతూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని వరి సాగులో దిగుబడులను ఎలా పెంచుకోవాలో రైతులకు తెలియజేశారు. తక్కువ ఖర్చుతో కూడిన సమగ్ర సస్య నిర్వహణ విధానాలపై దృష్టి సారించాలని ఆయన సూచించారు.
ఏడీఏ మనోహర మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని వరి సాగులో మెరుగైన దిగుబడులు సాధించాలని రైతులకు పిలుపునిచ్చారు. వ్యవసాయ అధికారుల సూచనలను పాటిస్తూ, ఆధునిక పద్ధతులను అనుసరించాలని ఆయన కోరారు.


