ఎల్లారెడ్డిలో ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయ, కార్మిక & పెన్షనర్ల సంయుక్త చర్య కమిటీ (TGEJAC) ఆధ్వర్యంలో మండల రెవెన్యూ అధికారి (MRO) ప్రేమ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు.
TGEJAC నాయకులు మాట్లాడుతూ, 2వ వేతన సవరణ కమిషన్ సిఫారసుల అమలు, హెల్త్ కార్డు, పెండింగ్ బిల్లుల చెల్లింపు, పాత పెన్షన్ పథకం (OPS) పునరుద్ధరణతో పాటు 63 డిమాండ్లపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
MRO ప్రేమ్ కుమార్ వినతిని స్వీకరించి, సమస్యలను పై అధికారులకు నివేదించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా TNGOs అధ్యక్షుడు లచిగారి మహిపాల్, యూనిట్ కార్యదర్శి వి. శరన్ కుమార్, కోశాధికారి యు. రవీందర్, ఉపాధ్యక్షులు జి. రాజా గౌడ్, జె. శ్రీకాంత్, PRTU రాష్ట్ర సహాధ్యక్షులు మైదం కృష్ణమూర్తి, మండల ఉపాధ్యాయులు, వివిధ సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.












