తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కామారెడ్డి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. విద్య, వైద్యం, క్రీడలు, సాగునీటి రంగాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల (బాయ్స్ హైస్కూల్) అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ నిధులతో పాఠశాలలో ఆధునిక తరగతి గదులు, మౌలిక వసతులు, క్రీడా సదుపాయాల అభివృద్ధి చేపట్టనున్నట్లు తెలిపారు.
నియోజకవర్గంలో విద్యా ప్రమాణాల పెంపుతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. యువతకు క్రీడా అవకాశాలు కల్పించేందుకు క్రీడా మైదానాలు, శిక్షణ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించామని చెప్పారు.
రైతులకు సాగునీటి సౌకర్యాలు విస్తరించి వ్యవసాయాభివృద్ధికి తోడ్పడే ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు షబ్బీర్ అలీ వివరించారు. ఇందిరాగాంధీ స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామన్నారు. దోమకొండలో ఫైర్ స్టేషన్, 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, ఎమ్మార్వో కార్యాలయాల నిర్మాణాలను త్వరలో చేపడతామని తెలిపారు.
కామారెడ్డి అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగుతూ ప్రతి గ్రామం, ప్రతి వర్గానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా కృషి చేస్తున్నామని షబ్బీర్ అలీ తెలిపారు. కామారెడ్డిని అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.












