జాతీయ సైన్స్ డే సందర్భంగా సామాజిక కార్యకర్త, విద్యావేత్త కె. శ్రీనివాసాచారి మాట్లాడుతూ, ప్రశ్నించడమే ప్రగతికి మూలమని, అదే శాస్త్రానికి పునాది అని స్పష్టం చేశారు. 1928 ఫిబ్రవరి 28న సర్ సి. వి. రామన్ ఆవిష్కరించిన 'రామన్ ఎఫెక్ట్' భారత విజ్ఞాన చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిందన్నారు.
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జరుపుకునే జాతీయ సైన్స్ డే, సర్ సి. వి. రామన్ 'రామన్ ఎఫెక్ట్' ఆవిష్కరణకు గుర్తుగా నిలుస్తుందని శ్రీనివాసాచారి తెలిపారు. ఈ ఆవిష్కరణకు గాను 1930లో రామన్ నోబెల్ బహుమతి అందుకున్నారని, విజ్ఞానశాస్త్రంలో నోబెల్ పొందిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు.
శాస్త్రం అంటే ప్రయోగశాలలకే పరిమితం కాదని, "ఎందుకు?" అని ప్రశ్నించే క్షణం నుంచే అది మొదలవుతుందని ఆయన వివరించారు. సందేహించడం, పరిశీలించడం, ఆధారాలతో నిజాన్ని నిర్ధారించుకోవడమే శాస్త్రీయ దృక్పథమని, దీనిని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం ప్రోత్సహించాలని సూచించారు.
రామన్ సూత్రం 'కాంతి ప్రవర్తన'పై కొత్త దారులను తెరిచిందని, దీని ఆధారంగానే నేడు వైద్యరంగం, రసాయన శాస్త్రం, పరిశ్రమల్లో అనేక ఆధునిక పరిశోధనలు సాధ్యమవుతున్నాయని తెలిపారు. భారత శాస్త్రీయ వారసత్వం పురాతన కాలం నుంచే విస్తరించి ఉందని, అది నేటి సాంకేతిక ప్రగతికి బలమని చెప్పారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A(h) ప్రకారం ప్రతి పౌరుడు శాస్త్రీయ దృక్పథాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉందని శ్రీనివాసాచారి గుర్తు చేశారు. మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని, ఆధారాలను ప్రశ్నించాలని, సత్యాన్ని స్వీకరించాలని, తప్పును సరిదిద్దుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. యువత ప్రశ్నించి, పరిశీలించి, ఆధారాలు కోరితేనే సమాజం అజ్ఞానం నుంచి జ్ఞానానికి ప్రయాణిస్తుందన్నారు.

