నీట్ పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయిన నిందితురాలు మనీషా మంధారేను విచారణ నిమిత్తం 14 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జీవశాస్త్ర నిపుణురాలైన మంధారేను శనివారం సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
పేపర్ లీకేజీలో మనీషా మంధారే కీలక పాత్ర పోషించారని, బోటనీ, జువాలజీ ప్రశ్నపత్రాల అనువాదంలో ఆమె నిపుణురాలని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. లీకేజీ సూత్రధారి, నీట్ కమిటీలో రసాయనశాస్త్ర నిపుణుడిగా ఉన్న పీవీ కులకర్ణితో కలిసి ఆమె ఈ కుట్రలో పాల్గొన్నారని సీబీఐ పేర్కొంది. కులకర్ణిని శుక్రవారం అరెస్ట్ చేశారు.
ప్రశ్నపత్రాల రూపకల్పనలో సభ్యులకు పూర్తి ప్రశ్నలు తెలిసే అవకాశం తక్కువగా ఉండటంతో, ఇతర సబ్జెక్టుల నిపుణులతో కలిసి కులకర్ణి లీకేజీకి పాల్పడినట్లు సీబీఐ గుర్తించింది. మనీషా వాఘ్మరే కూడా ఈ కుట్రలో కీలక పాత్రధారిగా ఉన్నట్లు సమాచారం.
ఈ కేసులో దేశవ్యాప్తంగా దాడులు, విచారణలు జరుగుతున్నాయని సీబీఐ న్యాయస్థానానికి వెల్లడించింది. మంధారేను విచారించడానికి, ఆమెను వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి ఆధారాలు సేకరించడానికి 14 రోజుల కస్టడీ అవసరమని సీబీఐ అభ్యర్థించింది. కోర్టు ఆదేశాల మేరకు మంధారేను సీబీఐ తమ ఆధీనంలోకి తీసుకుని విచారణ ప్రారంభించింది.











