విద్యార్థుల భవిష్యత్తుకు విద్యే బలమైన పునాది అని, ఈ విషయంలో గర్గుల్ గ్రామం ఆదర్శంగా నిలుస్తోందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేర్కొన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఆయన గురువారం గర్గుల్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి, విద్యార్థులతో కలిసి విద్యా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాఠశాలలో యూకేజీ తరగతిని ప్రారంభించి, చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. సంచారజాతులకు చెందిన చిన్నారులను పాఠశాలలో చేర్పించడం ద్వారా విద్య అందరికీ చేరువ కావాలనే ప్రభుత్వ సంకల్పాన్ని ఆయన ప్రశంసించారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటిన కలెక్టర్, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ చేశారు.
జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఈ సందర్భంగా సన్మానించారు. క్రీడలతో పాటు విద్యలోనూ రాణించాలని వారికి సూచించారు.
గ్రామ సర్పంచ్ దివ్య రవితేజ గౌడ్ విద్యాభివృద్ధికి చూపుతున్న ప్రత్యేక శ్రద్ధను కలెక్టర్ కొనియాడారు. విద్యార్థుల సమగ్రాభివృద్ధికి గ్రామస్తులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.










