తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ శనివారం 'చలో సెక్రటేరియట్'కు పిలుపునిచ్చిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మెహదీపట్నం పోలీస్ స్టేషన్ లో నిర్బంధించిన ఉద్యమకారులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు.
ఉద్యమకారులను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించడంతో, కవిత మెహదీపట్నం పోలీస్ స్టేషన్ కు చేరుకుని అక్కడి ఉద్యమకారులకు సంఘీభావం తెలిపారు. వారిని విడుదల చేసే వరకు తాను అక్కడి నుంచి కదిలేది లేదని ఆమె స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఉద్యమకారులను నిర్బంధించడం దురదృష్టకరమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, దీనిపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు.
ఉద్యమకారులకు భూమి, పెన్షన్ వంటి హామీలను వెంటనే అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జాగృతి ఆధ్వర్యంలో భూపోరాటాలు చేస్తామని ఆమె హెచ్చరించారు. హక్కులను సాధించుకోవడం పెద్ద విషయం కాదని, ఉద్యమకారులంతా ధైర్యంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై కాలయాపన చేస్తోందని కవిత విమర్శించారు. అసెంబ్లీలో కూడా ఈ హామీల ప్రస్తావన రాకపోవడం మోసపూరితమని ఆమె అన్నారు. ఉద్యమకారుల బిల్లు పెడతామని చెప్పి, ఆ ఊసే ఎత్తలేదని ఆమె ఆరోపించారు.










