విద్య సమాజాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధమని, అందోల్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు.
శనివారం అందోల్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి, విద్యాభివృద్ధి, మౌలిక వసతుల పెంపుపై దృష్టి సారించారు. శివంపేట పాలిటెక్నిక్ కళాశాలలో న్యూ హాలాండ్ పరిశ్రమ సిఎస్ఆర్ నిధులు రూ. 43 లక్షలతో నిర్మించిన మెకానికల్ వర్క్‌షాప్ షెడ్‌ను జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్యతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యతోనే జీవితాల్లో వెలుగులు నిండుతాయని, నియోజకవర్గంలో ఇప్పటికే పలు కళాశాలలు, పాఠశాలలు ఏర్పాటు చేశామని తెలిపారు. బాలికల భద్రత, వసతుల విషయంలో రాజీ లేదని స్పష్టం చేశారు.
సిఎస్ఆర్ నిధులు రూ.10 కోట్లతో విద్యాసంస్థలలో మౌలిక వసతుల మెరుగుదల పనులు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. తన పర్యటనలో భాగంగా రూ. 27.76 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.
అందోల్‌లో రూ. 1.80 కోట్లతో విద్యుత్ ఉపకేంద్రాన్ని, రూ. 53 లక్షలతో గ్రంథాలయ భవనం మొదటి అంతస్తును ప్రారంభించారు. రూ. 5 కోట్లతో పర్యాటక రెస్టారెంట్, రూ. 20 కోట్లతో ప్రభుత్వ కార్యాలయాల సముదాయం నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. విద్యార్థులు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.












