జుక్కల్ మండలం, సోమూర్ క్రాస్ రోడ్ వద్ద ఉన్న సన్షైన్ స్కూల్లో వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేస్తూ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ శివకుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో పాటు పట్టుదలతో చదివితే పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే దిశగా కృషి చేయాలని సూచించారు.
విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు పాఠశాల యాజమాన్యం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థుల విజయాలను అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాలని వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ అశోక్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.











