మార్కాపురం జిల్లాలో సీఐలుగా పనిచేస్తున్న పాపిశెట్టి కరుణాకర్, వి. శ్రీరామ్, కె.వి. రాఘవేంద్రరావులకు డిప్యూటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)లుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఈ ముగ్గురు అధికారులు మార్కాపురం జిల్లాలో సుదీర్ఘకాలం పాటు పోలీసు శాఖలో సేవలందించి, ప్రజలతో మమేకమై సమర్థవంతమైన అధికారులగా మంచి పేరు తెచ్చుకున్నారు. వీరితో స్థానిక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
కరుణాకర్, శ్రీరామ్, రాఘవేంద్రరావులు గతంలో మార్కాపురం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఎస్ఐలుగా, సీఐలుగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయా కాలాల్లో సంక్లిష్ట పరిస్థితుల్లో శాంతిభద్రతలను కాపాడటంలో వీరి పాత్ర కీలకంగా ఉంది.
ప్రజలకు అందించిన సేవలకు గాను వీరు గతంలో ప్రభుత్వ నుంచి ప్రశంస పత్రాలు కూడా అందుకున్నారు. ప్రస్తుతం వీరు గుంటూరు, ఒంగోలు ప్రాంతాల్లో వివిధ విభాగాల్లో సీఐలుగా విధులు నిర్వర్తిస్తున్నారు.
పదోన్నతి పలు కారణాల వల్ల ఆలస్యమైనప్పటికీ, డీఎస్పీలుగా పదోన్నతి పొందిన ఈ ముగ్గురిని మార్కాపురం జిల్లా ప్రజలు అభినందిస్తున్నారు.











