రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో సుమారు 18 వేల ఉద్యోగాల భర్తీ చేపట్టామని, త్వరలో ఏఎన్ఎం, నర్సింగ్ ఆఫీసర్ల ఫలితాలు విడుదల చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. విద్య, వైద్యం, మహిళా సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.
నారాయణఖేడ్‌లో 'ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యక్రమానికి మంత్రి దామోదర్ రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్య, ఆరోగ్య రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ చేపట్టినట్లు తెలిపారు.
మల్టీపర్పస్ ఏఎన్ఎంలు, నర్సింగ్ ఆఫీసర్ల ఉద్యోగ ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయని మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో విద్య, వైద్యం, మహిళా సాధికారత, సంక్షేమ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మహిళలు, శిశువులు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అంగన్వాడీలు, బాలసదనాల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు. అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి సీఎస్ఆర్ నిధులను కూడా వినియోగిస్తామని, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం, ఆరోగ్య సేవలు, ప్రీ-స్కూల్ విద్య, ఆరోగ్య పరీక్షలు ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు.
గ్రామాల్లో ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తల సేవలను మంత్రి కొనియాడారు. బాల సదనంలోని బాలికలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాల సదనంలో వెంటనే ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం దివ్యాంగులకు స్కూటీలను పంపిణీ చేశారు.












