మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో తీవ్రమైన ఎండ వేడిమి కారణంగా ఒక పూజారి మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
మందమర్రి పట్టణంలోని శాంతినగర్ గ్యారేజ్ ఏరియాకు చెందిన బండవరం ప్రశాంత్ (30) ఇంట్లోనే అధిక ఉష్ణోగ్రతల కారణంగా అస్వస్థతకు గురై మరణించినట్లు అధికారులు తెలిపారు. మృతుడు ప్రశాంత్ కు భార్యతో పాటు ఇద్దరు చిన్న కుమారులతో ఉన్నారని, పిల్లలు చిన్నవయస్కులు కావడంతో ఈ ఘటన చూసినవారందరూ కన్నీటిపర్యంతమయ్యారని సమాచారం.
ప్రశాంత్ మందమర్రి మండలం మామిడిగూడెం (లంబాడి తండ) గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఇటీవల జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడదెబ్బ ప్రభావం వల్లే ఈ దుర్ఘటన జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యుల నుండి వివరాలు సేకరించి, కేసు నమోదు చేసుకుని తదుపరి విచారణ చేపట్టారు. ఎండల తీవ్రతపై ప్రజలను అప్రమత్తం చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఈ ఘటనతో మృతుడి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పెరుగుతున్న వేడిగాలుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా మధ్యాహ్న వేళల్లో బయట తిరగవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.










