సర్పంచ్ పదవిలో ఉంటూ, ఏకకాలంలో చౌకధరల దుకాణం (రేషన్) డీలర్‌గా కొనసాగడం నిబంధనలకు విరుద్ధమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజాప్రతినిధిగా ఎన్నికైనప్పుడు ఏదో ఒక పదవిని మాత్రమే ఎంచుకోవాలని న్యాయస్థానం తేల్చి చెప్పింది.
కర్నూలు జిల్లా కే. మార్కాపురం గ్రామానికి చెందిన ఆర్. మద్దిలేటి అనే వ్యక్తి సర్పంచ్‌గా ఉంటూనే రేషన్ డీలర్‌గా కొనసాగుతున్నారు. 2024 నవంబర్ 26న జరిగిన తనిఖీల్లో నిల్వల్లో వ్యత్యాసాలు గుర్తించబడ్డాయి. ఈ క్రమంలో, ఒక వ్యక్తి రెండు పదవులను నిర్వహించడం 'ఏపీ స్టేట్ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం ఆర్డర్ 2018' నిబంధనలకు విరుద్ధమని అధికారులు గుర్తించారు.
దీనిపై కర్నూలు ఆర్డీఓ, మద్దిలేటి డీలర్‌షిప్‌ను 2024 డిసెంబర్లో రద్దు చేశారు. ఈ నిర్ణయాన్ని జాయింట్ కలెక్టర్ కూడా సమర్థించారు. అయితే, ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మద్దిలేటి హైకోర్టును ఆశ్రయించారు. తన వివరణను అధికారులు పరిగణనలోకి తీసుకోలేదని ఆయన వాదించారు.
ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు, నిబంధనల ప్రకారం రెండు హోదాల్లో కొనసాగడం చెల్లదని స్పష్టం చేసింది. సర్పంచ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ, అధికారులు తీసుకున్న డీలర్షిప్ రద్దు నిర్ణయాన్ని న్యాయస్థానం సమర్థించింది. ఈ తీర్పుతో, ప్రజాప్రతినిధులు ఒకేసారి రెండు పదవులను చేపట్టడంపై స్పష్టత లభించింది.











