మారుమూల ఆదివాసీ గూడాలల్లో తాగునీటి సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. మిషన్ భగీరథ పథకం పరిధిలోకి రాని ప్రాంతాల్లో తక్షణమే మంచినీటి బావులు, బోర్లు నిర్మించాలని మంత్రి సీతక్క ఆదేశించారు.
వేసవిలో తాగునీటి సమస్య తీవ్రతరం కాకుండా నివారణ చర్యలపై సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ దివ్య దేవరాజన్, ఈఎన్సీ కృపాకర్ రెడ్డితో కలిసి మంత్రి సీతక్క ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో, గ్రామీణ ప్రాంతాల్లో నీటి లభ్యతను పెంచడానికి ఉపాధి హామీ పథకం కింద కుంటల తవ్వకాన్ని విస్తృతం చేయాలని మంత్రి సూచించారు. భూగర్భ జలాలను పెంపొందించడం ద్వారా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే ఉన్న పైప్లైన్లలో ఏవైనా మరమ్మతులు అవసరమైతే, వాటిని వెంటనే చేపట్టాలని మంత్రి ఆదేశించారు. నీటి సరఫరా వ్యవస్థ సక్రమంగా పనిచేయడం తాగునీటి లభ్యతకు అత్యంత కీలకమని ఆమె అన్నారు. ఈ చర్యల ద్వారా ఆదివాసీ గూడాలల్లో నివసించే ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క తెలిపారు.











