సమాజంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తూ, సంకల్పంతో ప్రతి రంగంలోనూ అద్భుతాలు సృష్టించగలరని మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ (సీపీ) అవినాష్ మొహంతి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజ్గిరి కమిషనరేట్ ఆధ్వర్యంలో ఉప్పల్‌లో మహిళా పోలీసు అధికారులు, సిబ్బందికి నిర్వహించిన వేడుకల్లో ఆయన మాట్లాడారు.
ముఖ్య అతిథిగా హాజరైన సీపీ అవినాష్ మొహంతి మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పోటీ పడుతూ నాయకత్వ పాత్రలు పోషిస్తున్నారని కొనియాడారు. పోలీస్ శాఖలో మహిళా సిబ్బంది అందిస్తున్న సేవలు ఎంతో ప్రశంసనీయమని తెలిపారు.
గృహ హింస బాధితులకు అండగా నిలుస్తూ, కౌన్సెలింగ్ ద్వారా అనేక కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న మహిళా పోలీసుల సేవలు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. స్త్రీలను గౌరవించడం భారతీయ సంస్కృతిలో అంతర్భాగమని గుర్తు చేశారు.
మహిళా పోలీసులు తమ విధులను మరింత ధైర్యంగా, నమ్మకంతో నిర్వర్తించాలని, వృత్తిపరమైన బాధ్యతలతో పాటు వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకోవాలని సూచించారు. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని మహిళా సిబ్బంది సంక్షేమం, భద్రత, వృత్తిపరమైన ఎదుగుదలకు తాము కట్టుబడి ఉంటామని పునరుద్ఘాటించారు.
ఈ వేడుకల్లో భాగంగా మహిళల ఆరోగ్యం, పోషకాహారం, ఆర్థిక నిర్వహణ, మానసిక ఒత్తిడిని జయించడం వంటి అంశాలపై నిపుణులు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనరేట్‌కు చెందిన డీసీపీలు, ఏసీపీలు, సీనియర్ అధికారులు, మహిళా పోలీసులు పాల్గొన్నారు.

